నీట్ వివాదం: చట్టంపై ప్రభుత్వం పట్టు, క్షమాపణకు విపక్షాల డిమాండ్.. పోలీసుల తీరుపై సుప్రీం అసంతృప్తి / NEET Row Escalates: Parliament Deadlocked Over New Bill, SC Flags Police Action on Protesters
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకల వ్యవహారం దేశవ్యాప్తంగా ఇంకా రాజుకుంటూనే ఉంది. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ పరిస్థితులు సద్దుమణగలేదు. ఈ వివాదం అటు పార్లమెంట్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదాలకు దారి తీస్తుండగా.. ఇటు ఢిల్లీలో న్యాయం కోసం గళం వినిపిస్తూనే ఉన్నారు. ఈ పరిణామాల మధ్య ఆందోళనకారుల పట్ల పోలీసుల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
సభలో బిల్లు వర్సెస్ విపక్షాల డిమాండ్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించేలా 2024 నాటి చట్టాన్ని సవరించే ‘పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణ సవరణ బిల్లు-2026’ను కేంద్ర ప్రభుత్వం సోమవారం (జూలై 27న) లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై సమగ్ర చర్చకు లోక్‌సభలో 6 గంటలు, రాజ్యసభలో 7 గంటలు చొప్పున సమయాన్ని కేటాయిస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు. పార్లమెంటులో గందరగోళం సృష్టించకుండా విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా నిర్మాణాత్మక చర్చ జరపాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
ప్రధాని క్షమాపణకు ప్రతిపక్షాల పట్టు
ప్రభుత్వం బిల్లుపై చర్చ జరపాలని కోరుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం వేరే అంశాలపై గట్టిగా పట్టుబడుతున్నాయి. ఢిల్లీలో దీక్షలు చేపట్టినప్పుడు విద్యార్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరు మీద సమగ్రంగా చర్చ చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేస్తూ సభలను స్తంభింపజేశాయి. విద్యార్థి లోకానికి ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని, అలాగే వారిపై పోలీసుల దాష్టీకానికి గానూ హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేయాలని పట్టుబట్టాయి. మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో అడుగుపెడుతున్నప్పుడు అధికార పక్షం ‘జిందాబాద్.. జిందాబాద్’ అని, విపక్షం ‘చోర్ చోర్.. పేపర్ చోర్’ అని పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసుల తీరుపై సుప్రీం అసంతృప్తి
ఇదిలా ఉండగా, జంతర్ మంతర్ వద్ద కాక్ రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిరసనలకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు భారత రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కు అని, దాన్ని ఎవరికీ నిరాకరించే అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆందోళనలు జరుగుతున్నాయనే కారణంతో పోలీసులు మితిమీరిన బలప్రయోగం చేయడాన్ని సమర్థించలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
శాంతియుత ఆందోళనలు చేయాలనుకుంటే అందుకు ఒక నిర్దిష్ట ప్రోటోకాల్ ఉండాలని, అలాంటి నిరసనలకు తగిన స్థలాన్ని కల్పించాలని ధర్మాసనం పేర్కొంది. సంఘ విద్రోహ శక్తులు చొరబడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. అయితే పోలీసుల భద్రత కూడా చాలా ముఖ్యమైనదేనని జస్టిస్ సూర్యకాంత్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనల నిర్వహణకు సంబంధించి ఏకరూప మార్గదర్శకాలు రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.
కేంద్రానికి సీజేపీ తాజా హెచ్చరికలు
మరోవైపు, నిరసన విరమణ సమయంలో తమకిచ్చిన హామీని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని సీజేపీ ఆరోపించింది. ఇటీవలి నిరసనల్లో పాల్గొన్న వారిపై క్రిమినల్ కేసులు, ఎఫ్ఐఆర్ లను ఎత్తివేయాలని, వారిపై కొత్త ఎఫ్ఐఆర్ లేవీ దాఖలు చేయకూడదని కేంద్ర మంత్రులు జె.పి.నడ్డా, జితేంద్రసింగ్ లతో జరిగిన మూడో విడత చర్చల్లో అంగీకారం కుదిరిందని సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా గుర్తు చేశారు. న్యాయపరమైన సంప్రదింపుల అనంతరం ఆ ఒప్పందాన్ని మంగళవారం (నేడు) కల్లా రాతపూర్వకంగా తమకు అందించకపోతే, తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ నిరసనలకు దిగాల్సి వస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
విద్యార్థులకు సిబల్ న్యాయ సహాయం
తమ ఉద్యమాన్ని రాజకీయ ప్రేరేపితమైనదిగా ఎవరూ పక్కదోవ పట్టించకుండా ఉండేందుకు అవసరమైన చర్యలపై తాము సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ను సంప్రదించినట్లు అశుతోష్ వెల్లడించారు. ఇటీవలి నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల్లో ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోకూడదని కపిల్ సిబల్ నొక్కిచెప్పినట్లు సమాచారం. విద్యార్థులకు, నిర్వాహకులకు న్యాయ సహాయం అందించేందుకు ప్రజల విరాళాలతో ఆన్లైన్ లీగల్ ఎయిడ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీజేపీ వెల్లడించింది. ఈ ఫండ్‌కు కపిల్ సిబల్ రూ. కోటి విరాళం ప్రకటించారు. నీట్ పేపర్ లీక్‌పై నిరసనల వేళ తమ రాష్ట్రంలో నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించడం కాస్త ఉపశమనం కలిగించే విషయంగా వారు పేర్కొన్నారు. అయితే ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో వందల మంది వేధింపులకు గురవుతున్నారని సీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు

డేటా సెంటర్ల చుట్టూ దుమారం.. నిజం ఎక్కడ? Vizag Data Centre Push Faces Water, Green Concerns
August 20, 2026, 7:04 AM IST

Dr Ainapurapu Receives National Anubhav Award 2026
August 18, 2026, 6:47 PM IST

దక్షిణాదిపై గురి.. తెలంగాణకు చోటేదీ? BJP’s New National Team Leaves Telangana Out of Southern Equation
August 18, 2026, 7:41 AM IST

అసెంబ్లీ వద్దు.. శాసనమండలి ముద్దు – ఇదేం తీరు? YSRCP Bets on Council as Assembly Boycott Continues
August 13, 2026, 7:15 AM IST

వైసీపీకి డీఎస్సీ ఆక్సిజన్.. పాలపొంగేనా? DSC Row Gives YSRCP Fresh Political Momentum in Andhra Pradesh
August 11, 2026, 7:01 PM IST
