ఆంధ్రప్రదేశ్

రంపచోడవరంలో విద్యార్థులతో చంద్రబాబు, లోకేష్ భోజనం: పాఠశాలల్లో విద్యార్థుల పోషకాహారంపై సీఎం కీలక ఆదేశాలు.. CM Chandrababu, Minister Lokesh share meal with students, stress nutritional food in schools

రంపచోడవరంలో నిర్వహించిన ‘మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్’ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో అందిస్తున్న పోషకాహారం, విద్యార్థుల ఆరోగ్యం, శారీరక ఎదుగుదలపై సీఎం, మంత్రి, విద్యాశాఖ అధికారుల మధ్య ఆసక్తికర చర్చ సాగింది.

చిక్కీలు – మిల్లెట్స్ పై సమగ్ర చర్చ


భోజన సమయంలో అధికారులు విద్యార్థులకు అందిస్తున్న చిక్కీలను సీఎంకు చూపగా, గతంలో కేవలం పల్లీ చిక్కీ మాత్రమే ఇచ్చేవారని, ప్రస్తుతం అందులో 20% మిల్లెట్స్ (చిరుధాన్యాలు) మరియు బెల్లం (Jaggery) జోడించి ‘మిల్లెట్ చిక్కీ’గా అందిస్తున్నామని వివరించారు. దీని ద్వారా విద్యార్థులకు మెరుగైన పోషకాలు అందుతాయని తెలిపారు. ఇందుకు సీఎం స్పందిస్తూ, ఈ చిక్కీలను మధ్యాహ్న భోజనం తర్వాత ఇవ్వడం కంటే, సాయంత్రం పాఠశాల ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో (స్నాక్‌గా) ఇస్తే పిల్లల శరీరంలో కార్బోహైడ్రేట్లు సమతుల్యంగా ఉంటాయని సూచించారు.

వయస్సు – శారీరక ఎదుగుదలకు తగ్గట్లుగా పోషకాలు


చిక్కీలు, రాగి జావ (రాగి మాల్ట్) సరఫరాపై సీఎం మరింత కీలక సూచనలు చేశారు. చిన్న పిల్లలు, పెరిగే వయసులో ఉన్న పెద్ద విద్యార్థులకు ఒకే పరిమాణంలో (Size/Quantity) పోషకాహారం సరిపోదని, వయస్సు/ఎదుగుదలను బట్టి రెండు వేర్వేరు పరిమాణాల్లో (Two Sizes) చిక్కీలు మరియు రాగి జావ అందించాలని స్పష్టం చేశారు. పిల్లల్లో పోషకాహార లోపం (Malnutrition) లేకుండా చూస్తూనే, అతిగా కాకుండా (Overnutrition) సరైన బ్యాలెన్స్ పాటించాలని చెప్పారు. అలాగే, జిల్లాల వారీగా విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు (Health Check-ups) నిర్వహించి, ఆయా ప్రాంతాల అవసరాలకు తగ్గట్లుగా న్యూట్రిషన్ అందించాలని ఆదేశించారు.

రాగి జావ ప్రాయోజకత్వం – భోజన నాణ్యత


మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుంటూ, రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉదయం పూట సరఫరా చేసే రాగి జావ ప్రాజెక్ట్ (రూ. 70-80 కోట్లు) మొత్తం ‘శ్రీ సత్యసాయి ట్రస్ట్’ స్పాన్సర్ చేస్తోందని సీఎంకు వివరించారు. గతంలో బాపట్లలో సీఎం ఇచ్చిన సూచనల మేరకు విద్యార్థుల కోసం నాణ్యమైన సన్న బియ్యం (Fine Rice) మరియు ఆకుకూరలతో కూడిన రీజినల్ మెనూను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ వినూత్న మార్పుల వల్ల పాఠశాలల్లో భోజన నాణ్యత పెరిగిందని, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారని సీఎం మరియు మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

విద్యాశాఖలో సాంకేతికత – బడ్జెట్ ఆదా


పాఠశాలల్లో టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థుల హాజరును మధ్యాహ్న భోజన పథకం వివరాలతో అనుసంధానం (డేటా ట్రయాంగులేషన్) చేస్తున్నట్లు అధికారులు వివరించారు. దీనివల్ల ఆహారం, స్టూడెంట్ కిట్లు మరియు ఇతర వస్తువుల కొనుగోళ్లలో పారదర్శకత పెరిగిందని తెలిపారు. ఈ రకమైన పారదర్శక టెండర్లు, సాంకేతిక మార్పుల ద్వారా రాబోయే ఐదేళ్లలో విద్యాశాఖ బడ్జెట్‌లో దాదాపు 1500 కోట్ల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ సీఎంకు వివరించారు.

ప్రాజెక్టు వ్యయం – హెల్త్ ఇంపాక్ట్ స్టడీ


ఈ మొత్తం న్యూట్రిషన్ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు 180 కోట్ల రూపాయలని అధికారులు తెలిపారు. పిఎం శ్రీ (PM SHRI) పాఠశాలలకు లభించే చిన్న భాగం మినహా మిగిలిన మొత్తం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. అంతేకాకుండా, పాఠశాలల్లో అందిస్తున్న ఆహారం వల్ల విద్యార్థుల ఆరోగ్యం మరియు ఎదుగుదలలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకోవడానికి హెల్త్ ఇంపాక్ట్ స్టడీ (Impact Study) ని కూడా ప్రారంభించినట్లు వివరించారు.

సంజీవని డేటా అనుసంధానం


విద్యార్థుల ఆరోగ్య వివరాలను ‘సంజీవని’ డేటాతో క్లబ్ (అనుసంధానం) చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనివల్ల ఏ ప్రాంతంలో విద్యార్థులకు ఏ విటమిన్లు లేదా పోషకాల లోపం ఉందో స్పష్టంగా తెలుస్తుందని, దానికి అనుగుణంగా ఆహారంలో మార్పులు చేయడానికి వీలవుతుందని స్పష్టం చేశారు.

విద్యార్థులతో లోకేష్ – సీఎం సంభాషణ


భోజనం చేసే సమయంలో మంత్రి లోకేష్ తన పక్కన ఉన్న విద్యార్థినితో ఆత్మీయంగా మాట్లాడారు. ఇంట్లో ఎంతమంది తోబుట్టువులు ఉన్నారు, వారు ఎక్కడ చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు ఈ సమావేశానికి వచ్చారా అని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా విద్యార్థులు ఆకుకూరలు, అన్నం సరిగ్గా తినకపోవడాన్ని గమనించి, పళ్లానికి వడ్డించిన ఆహారాన్ని సరిగ్గా తినాలని ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చిన్న పిల్లలు ఇంట్లో కూడా చాక్లెట్లు ఇలాగే తింటుంటారా అని సరదాగా అడిగారు.

పేరెంట్-టీచర్ మీటింగ్‌పై సీఎం అభిప్రాయం


తాను ప్రతి పేరెంట్-టీచర్ మీటింగ్‌కు ఏదో ఒక పాఠశాలకు వెళ్లి, ఇలా పిల్లలతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని సీఎం చెప్పారు. దీనివల్ల భోజనం నాణ్యతతో పాటు విద్యార్థుల సమస్యలు నేరుగా తెలుస్తాయని పేర్కొన్నారు.

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *