ఆంధ్రప్రదేశ్

ఏపీ గ్రామీణ పాలనలో సరికొత్త చరిత్ర.. 23 పంచాయతీలకు అంతర్జాతీయ ఐఎస్ఓ గుర్తింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పాలనలో సరికొత్త మైలురాయి నమోదైంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సుపరిపాలనకు నిదర్శనంగా రాష్ట్రంలోని 23 గ్రామ పంచాయతీలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐఎస్ఓ 9001:2015 ధృవీకరణను సాధించాయి. Gram Panchayats Achieve ISO Certification ఈ విశిష్ట ఘనత పట్ల ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం రాష్ట్రానికే గర్వకారణమని అభివర్ణించిన ఆయన, ఇందుకు అంకితభావంతో పనిచేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

సుపరిపాలనకు అంతర్జాతీయ గుర్తింపు

ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలను అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పంచాయతీల్లో విస్తృతమైన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా సిటిజన్ చార్టర్ అమలు, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, శాస్త్రీయ డాక్యుమెంట్ నిర్వహణ, రికార్డుల డిజిటలైజేషన్ వంటి పనులను విజయవంతంగా చేపట్టింది. అదేవిధంగా, తాగునీటి సదుపాయాలు, దివ్యాంగులకు అనుకూలమైన వసతుల కల్పన, సమాచార బోర్డుల ఏర్పాటు, కార్యాలయ పరిశుభ్రత, ఆస్తుల సమర్థ నిర్వహణ, అగ్నిమాపక భద్రత, అంతర్గత ఆడిట్లు, సిబ్బందికి నిరంతర శిక్షణ, క్రమబద్ధమైన సమీక్షలు వంటి ఉత్తమ పాలనా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని పవన్ కళ్యాణ్ వివరించారు.

ఏపీ గ్రామీణ పాలనలో సరికొత్త చరిత్ర..

ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ అనేది కేవలం ఒక సాధారణ గుర్తింపు మాత్రమే కాదని, గ్రామ పంచాయతీల్లో ప్రజాకేంద్రిత, జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలనకు ఇది ఒక ప్రపంచ స్థాయి ప్రమాణమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ 23 గ్రామ పంచాయతీలు సాధించిన ఘనత రాష్ట్రంలోని మిగిలిన 13 వేలకు పైగా గ్రామ పంచాయతీలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ప్రతి గ్రామంలో మరింత నాణ్యమైన సేవలను అందిస్తూ, సరికొత్త పరిపాలనా ప్రమాణాలకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *