ఎడిటోరియల్తెలంగాణబర్నింగ్

కొండా సురేఖ వ్యవహారం.. క్రమశిక్షణకే రేవంత్ ప్రాధాన్యం? Konda Surekha Row Puts Congress Discipline in Focus

కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌కు సిఫారసు చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతవరకు పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ఒక్కరోజు వివాదానికి వచ్చిన ప్రతిస్పందనా? లేక చాలా కాలంగా పేరుకుపోతున్న అసంతృప్తి, పార్టీ క్రమశిక్షణపై ప్రశ్నలు, ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బహిరంగంగా సవాల్ చేసే రాజకీయ ధోరణికి వచ్చిన ముగింపా? ప్రస్తుతం జరిగిన పరిణామాలను పరిశీలిస్తే రెండో ప్రశ్నకే ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తోంది.

ఈ నిర్ణయం వెలుగులోకి వచ్చిన సమయంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కొండా సురేఖ రాసిన లేఖ కూడా మీడియాకు చేరింది. మంత్రిగా తనకు అధికారాలు లేకుండా చేశారని, తన ప్రమేయం లేకుండానే తన శాఖలో నిర్ణయాలు తీసుకున్నారని, తన ఓఎస్డీ సుమంత్‌ను కూడా తనకు తెలియకుండానే తొలగించారని ఆమె పేర్కొన్నారు. తన విషయంలో జరిగిన వ్యవహారంపై విచారణ జరపాలని కోరారు. సురేఖ వాదన ప్రకారం చూస్తే తనను కొంతకాలంగా ప్రభుత్వ వ్యవస్థలో పక్కన పెడుతున్నారన్న అసంతృప్తి ఆమెకు ఉంది. అయితే ఇక్కడ మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఒక మంత్రికి అధికారాలు తగ్గించారా అన్నది ఒక అంశమైతే, ముఖ్యమంత్రి – మంత్రి మధ్య విశ్వాసం అంతగా దెబ్బతినే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది మరో అంశం. అధికారాలు తగ్గించడం సమస్యకు కారణమా? లేక అప్పటికే పెరిగిన రాజకీయ దూరానికి అది ఫలితమా? అన్నది ఇప్పుడు ప్రధాన చర్చ.

కొండా సురేఖ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ నేతగా గుర్తింపు పొందారు. వరంగల్ ప్రాంతంలో కొండా కుటుంబానికి రాజకీయ ప్రభావం కూడా ఉంది. తమ కుటుంబానికి అక్కడ ప్రత్యేక స్థానం ఉందన్న ధీమా వారి రాజకీయ వ్యాఖ్యల్లో గతంలోనూ కనిపించింది. అయితే ఒక ప్రాంతంలో రాజకీయ ప్రభావం ఉండటం ఒక విషయం. అధికార పార్టీలో మంత్రిగా కొనసాగుతూ పార్టీ నిర్ణయాలు, పీసీసీ వ్యవస్థ, ముఖ్యమంత్రి నాయకత్వంతో సమన్వయం కొనసాగించడం మరో విషయం. ఇక్కడే సురేఖ రాజకీయ శైలి ఆమెకు ఇటీవల మైనస్‌గా మారిందా అన్న ప్రశ్న వస్తోంది. పరకాల రాజకీయాల విషయంలో మొదలైన వివాదం దీనికి ప్రధాన ఉదాహరణ. భవిష్యత్ ఎన్నికల్లో అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మద్దతుగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల తర్వాత కొండా కుటుంబం నుంచి వచ్చిన ప్రతిస్పందన సాధారణ అసంతృప్తి స్థాయిలో ఆగలేదు. సురేఖ కుమార్తె సుస్మిత బహిరంగంగా స్పందించడం, అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాననే స్థాయికి వ్యాఖ్యలు వెళ్లడంతో కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అంశం ముందుకు వచ్చింది.

రాజకీయాల్లో విభేదాలు సహజమే. పార్టీలు వాటిని సర్దుబాటు చేసుకుంటాయి. నాయకులు తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి వివరిస్తారు. కొన్నిసార్లు వెనక్కి తగ్గుతారు కూడా. కానీ సురేఖ వ్యవహారంలో వివాదం తగ్గడం కంటే ఒక్కో దశలో మరింత పెరిగింది. అత్యంత కీలకమైన మలుపు ఢిల్లీలో కనిపించింది. తనపై క్రమశిక్షణ చర్యల చర్చ జరుగుతున్న సమయంలో సురేఖ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే ప్రశ్నలు సంధించారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎంపై కూడా చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తాను పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇతర నాయకులు, మంత్రుల విషయంలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలూ లేవనెత్తారు.

ఆమె వాదనలో.. ఒకే ప్రమాణం అందరికీ వర్తించాలి అన్న భావన ఉన్నప్పటికీ, పార్టీ క్రమశిక్షణపై వివరణ ఇవ్వాల్సిన సమయంలో ముఖ్యమంత్రినే బహిరంగంగా ఎదుర్కోవడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. ఇక్కడే ఒక అనుమానం కూడా రాజకీయ వర్గాల్లో వినిపించింది. ఢిల్లీకి వెళ్లిన సమయానికే తనపై కఠిన నిర్ణయం వచ్చే అవకాశాన్ని సురేఖ అంచనా వేశారా? అందుకే సర్దుబాటు స్వరం కంటే ఎదురుదాడి స్వరాన్ని ఎంచుకున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం ఆమెకే తెలుసు. ఇక్కడ రేవంత్ రెడ్డి రాజకీయ స్థానం కూడా పరిశీలించాల్సిందే. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచారానికి ఆయన ప్రధాన ముఖంగా నిలిచారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే క్రమంలో పార్టీకి దూకుడు తీసుకురావడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని నడిపించడం, కాంగ్రెస్ నేతలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

కాంగ్రెస్ విజయాన్ని ఒక్క వ్యక్తికే పూర్తిగా ఆపాదించడం సరైంది కాదు. పార్టీ అధిష్ఠానం, ఇతర సీనియర్ నేతలు, అభ్యర్థులు, స్థానిక సమీకరణాల పాత్ర కూడా ఉంది. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో రేవంత్ నాయకత్వం కీలకమైనదన్నది రాజకీయ వాస్తవం. ముఖ్యమంత్రిగా ఆయన ముందున్న లక్ష్యం కూడా ఒక్క ప్రభుత్వాన్ని నడపడం మాత్రమే కాదు. కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలంటే ప్రభుత్వం, పార్టీ, మంత్రివర్గం, ప్రజాప్రతినిధులు ఒకే దిశలో నడవాల్సి ఉంటుంది. ఈ కోణంలో చూసినప్పుడు సురేఖ అంశం ఒక్క మంత్రి పదవికి సంబంధించిన సమస్యగా కనిపించదు. ఈరోజు ఒకరు పార్టీ లైన్‌ను బహిరంగంగా సవాల్ చేసినా చర్య లేకపోతే రేపు మరొక మంత్రి, మరో ఎమ్మెల్యే కూడా అదే స్వరాన్ని పెంచే అవకాశం ఉంటుంది. అందుకే క్రమశిక్షణ విషయంలో స్పష్టమైన గీత అవసరమని కాంగ్రెస్ నాయకత్వం భావించి ఉండొచ్చన్న విశ్లేషణకు ప్రస్తుత పరిణామాలు బలం ఇస్తున్నాయి.

రేవంత్ రాజకీయ శైలిలో మరో అంశం కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తోంది. తన ప్రభుత్వంలోని ప్రతి అంతర్గత విభేదాన్ని బహిరంగ వ్యక్తిగత యుద్ధంగా మార్చుకోవడం కంటే ప్రత్యర్థి పార్టీలపైనే తన రాజకీయ దూకుడును ఎక్కువగా కేంద్రీకరించిన నాయకుడిగా ఆయన కనిపించారు. సురేఖ వ్యవహారంలో కూడా మొదటి నుంచే నేరుగా మాటల యుద్ధానికి దిగకుండా పీసీసీ క్రమశిక్షణ వ్యవస్థ, ఏఐసీసీ నాయకత్వం ద్వారా వ్యవహారం ముందుకు వెళ్లింది. ఇదే సమయంలో కొండా కుటుంబ రాజకీయ బలాన్ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. వరంగల్ రాజకీయాల్లో వారికి ప్రత్యేక గుర్తింపు, అనుచర వర్గం ఉన్నాయి. సురేఖకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. కానీ ప్రాంతీయ రాజకీయ ప్రభావాన్ని రాష్ట్రవ్యాప్త పార్టీ నాయకత్వంతో సమానంగా చూడటం ఎంతవరకు సరైన లెక్క అన్న ప్రశ్న మాత్రం ఈ పరిణామాలతో ముందుకొచ్చింది.

రేవంత్ రెడ్డికి ఉన్న మరో కీలక రాజకీయ బలం ఢిల్లీ అధిష్ఠానంతో కొనసాగుతున్న సమన్వయం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంతో కలిసి రాష్ట్ర రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాల్లో రాజకీయంగా తలపడుతూ, రాష్ట్ర ప్రయోజనాల పేరుతో జాతీయ స్థాయి వేదికలపైనా తన స్వరం వినిపిస్తున్న రేవంత్ రాజకీయ పరిధితో పోలిస్తే కొండా కుటుంబ ప్రభావం ప్రధానంగా వరంగల్ ప్రాంత సమీకరణాల చుట్టూనే కేంద్రీకృతమై ఉంది. అందువల్ల ఒక ప్రాంతంలో తమకు తిరుగులేదన్న రాజకీయ ధీమాను రాష్ట్రవ్యాప్త పార్టీ నాయకత్వానికి ప్రత్యామ్నాయ శక్తిగా భావించడం కొండా శిబిరం చేసిన రాజకీయ అంచనా తప్పిదమా అన్న ప్రశ్న కూడా తాజా పరిణామాలతో ముందుకొస్తోంది.

ఒకవైపు వరంగల్ కేంద్రంగా కొండా కుటుంబ రాజకీయ ప్రభావం. మరోవైపు తెలంగాణ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతతో ఉన్న ముఖ్యమంత్రి. ఈ రెండింటి మధ్య రాజకీయ బలం కొలిచే ప్రమాణాలు సహజంగానే వేర్వేరు. సురేఖకు రాజకీయంగా అతిపెద్ద మైనస్‌గా కనిపిస్తున్నది ఆమె దూకుడు ఒక్కటే కాదు. ఆ దూకుడును ఎక్కడ ఆపాలి అన్న గీత స్పష్టంగా కనిపించకపోవడమేనా అన్న ప్రశ్న. రాజకీయంగా ఎదగాలని ప్రతి నాయకుడూ కోరుకుంటారు. తన నియోజకవర్గం బలపడాలని, తన అనుచరులకు అవకాశాలు రావాలని కోరుకోవడం సహజం. కానీ అధికార పార్టీలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత రాజకీయ లక్ష్యాలు పార్టీ విధివిధానాలతో ఢీకొంటే చివరకు ఏది వెనక్కి తగ్గాలి అన్నది కీలకం.

సురేఖ తాజా లేఖ మాత్రం ఆమె వాదనను మరో కోణంలో తెరపైకి తెచ్చింది. మంత్రిగా తన అధికారాలు తగ్గించారని, తనకు తెలియకుండా శాఖలో నిర్ణయాలు జరిగాయని ఆమె చెబుతున్నారు. ఈ ఆరోపణలు చిన్నవి కావు. వాటిపై నిజానిజాలు తేలాల్సిందే. ఆమెను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారా? లేక ముఖ్యమంత్రి – మంత్రి మధ్య అప్పటికే ఏర్పడిన విశ్వాస లోటు పరిపాలనా నిర్ణయాల్లో ప్రతిబింబించిందా? దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఒక క్యాబినెట్ మంత్రి తన శాఖలో నిర్ణయాలు తనకు తెలియకుండా జరుగుతున్నాయని పార్టీ జాతీయ అధ్యక్షుడికే ఫిర్యాదు చేసే స్థితికి వ్యవహారం వచ్చిందంటే వారిద్దరి మధ్య సంబంధాలు సాధారణ స్థాయిలో లేవని మాత్రం స్పష్టమవుతోంది.

సుస్మిత వ్యాఖ్యలు, పరకాల టికెట్ వివాదం, క్రమశిక్షణ నోటీసులు, ఢిల్లీలో ముఖ్యమంత్రిపై సురేఖ చేసిన నేరుగా వ్యాఖ్యలు, ఖర్గేకు రాసిన లేఖ.. ఇవన్నీ కలిసే ఈ రాజకీయ ఘట్టాన్ని నిర్మించాయి. అందుకే ఈ వ్యవహారాన్ని రేవంత్ వర్సెస్ కొండా సురేఖ అనే వ్యక్తిగత పోరుగా మాత్రమే చూడటం సరి కాదు. అసలు పోరు పార్టీ క్రమశిక్షణకు, వ్యక్తిగత రాజకీయ ప్రాబల్యానికి మధ్య జరిగిందా అన్న కోణంలో చూడాల్సి ఉంది. రేవంత్ రెడ్డికి మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలనే రాజకీయ లక్ష్యం ఉంది. అందుకోసం ప్రభుత్వం, పార్టీ ఒకే దిశలో నడవాలని ఆయన కోరుకోవడం సహజం. అదే సమయంలో సురేఖ తన రాజకీయ స్థానం, కుటుంబ ప్రభావం, ప్రాంతీయ సమీకరణాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శ ఉంది. ఆమె మాత్రం తనను అన్యాయంగా టార్గెట్ చేశారని, తన అధికారాలను తగ్గించారని వాదిస్తున్నారు.

చివరికి ఒక ప్రాంతంలో ఎంతటి రాజకీయ బలం ఉన్నా అధికార పార్టీలో వ్యక్తిగత ప్రభావం పార్టీ వ్యవస్థను మించగలదా? మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి నాయకత్వాన్నే బహిరంగంగా ప్రశ్నించిన తర్వాత కూడా అదే రాజకీయ సమీకరణ కొనసాగుతుందా? క్రమశిక్షణ విషయంలో ఒకరికి మినహాయింపు ఇస్తే రేపు అదే స్వరం మరో మంత్రి నుంచి, మరో ఎమ్మెల్యే నుంచి వినిపించదనే హామీ ఏమిటి? కొండా సురేఖ రాజకీయ ప్రయాణంలో తాజా మలుపు ఈ ప్రశ్నల మధ్యే వచ్చింది. పదవి పోవడం ఒక వ్యక్తికి రాజకీయ నష్టం కావచ్చు. కానీ అధికార పార్టీలో ఎవరి రాజకీయ బలం ఎంత ఉన్నా పార్టీ విధివిధానాలు, సమష్టి బాధ్యత, నాయకత్వ క్రమశిక్షణ కంటే పైకాదనే సందేశం ఇవ్వడం మాత్రం నాయకత్వానికి దీర్ఘకాలికంగా ముఖ్యమే.

అందుకే చివరకు మిగిలే ప్రశ్న ఒక్కటే. కొండా సురేఖను రేవంత్ రెడ్డి రాజకీయంగా పక్కన పెట్టారా? లేక నా రూటు సపరేటు అన్నట్టుగా సాగిన రాజకీయ శైలే చివరకు ఆమెను ఈ పరిస్థితికి తీసుకొచ్చిందా?

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *