ఏపీ సిగలో… శ్రీసిటీ మణిహారం / Sri City Marks Eighteen Years as Andhra’s Manufacturing Growth Engine
18 ఏళ్ల ప్రగతి పండుగ
పద్దెనిమిదేళ్లు… ప్రపంచ దేశాల నుంచి కంపెనీలు… పదుల వేల కోట్ల పెట్టుబడులు… వేలాది కుటుంబాలకు ఉపాధి. ఒకప్పుడు పారిశ్రామిక కలగా మొదలైన శ్రీసిటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తయారీ రంగానికి ప్రత్యేక చిరునామాగా నిలిచింది. “చినుకు చినుకు కలిస్తే చెరువు” అన్నట్టుగా ఒక్కో పరిశ్రమ, ఒక్కో పెట్టుబడి, ఒక్కో ఉద్యోగంతో సాగిన ప్రయాణం ఆగస్ట్ 8తో మరో మైలురాయిని దాటింది. ఇది కేవలం ఒక సెజ్ విజయగాథ కాదు… పెట్టుబడిని ఉపాధిగా, పరిశ్రమను ప్రాంతీయ ప్రగతిగా మార్చిన నమూనా. అందుకే ఏపీ సిగలో శ్రీసిటీ మణిహారం అనే మాటకు ఇప్పుడు మరింత బలం కనిపిస్తోంది.
కల నుంచి కార్యరూపం దాకా
ఆగస్ట్ 8, 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన శ్రీసిటీ ప్రయాణం వెనుక ఒక దీర్ఘకాలిక పారిశ్రామిక ఆలోచన ఉంది. వెనుకబడిన ప్రాంతంలో ప్రపంచస్థాయి పరిశ్రమలను తీసుకురావడం, వాటి చుట్టూ మౌలిక వసతులు నిర్మించడం, స్థానికులకు అవకాశాలు కల్పించడం ఆ ఆలోచనలో ప్రధాన భాగం. అంతర్గత రహదారులు, విద్యుత్, నీరు, పారిశ్రామిక సదుపాయాలు క్రమంగా విస్తరించడంతో పెట్టుబడిదారుల నమ్మకం పెరిగింది. పరిశ్రమ ముందుకొస్తే దాని వెంట మౌలిక వసతులు, ఉపాధి, సేవల రంగం కూడా కదులుతుందనే విషయాన్ని ఈ ప్రయాణం స్పష్టం చేస్తోంది.
అంకెల వెనుక అంతర్జాతీయ విశ్వాసం
శ్రీసిటీ ఎదుగుదలను కేవలం విస్తీర్ణంతో కొలవలేం. ప్రస్తుతం 31 దేశాలకు చెందిన 260కి పైగా కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ఏర్పాటు చేసుకున్నాయని సంస్థ అధికారిక సమాచారం చెబుతోంది. పదుల వేల కోట్ల పెట్టుబడులు, 60 వేల కోట్ల స్థాయిని దాటిన ఎగుమతులు, 75 వేల ఉద్యోగాలు ఈ పారిశ్రామిక వ్యవస్థ పరిమాణాన్ని తెలియజేస్తున్నాయి. ఒకే ప్రాంతంపై ఇన్ని దేశాల సంస్థలు విశ్వాసం ఉంచడం అంటే భూమి అందుబాటులో ఉండటం మాత్రమే కారణం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ, స్కిల్డ్ మ్యాన్ పవర్, బిజినెస్ ఎకోసిస్టం, కలిసివస్తే పెట్టుబడులు నిలబడతాయనే సంకేతాలిస్తున్నాయి.
ఉపాధితో మారుతున్న జీవన చిత్రం
పరిశ్రమ విజయానికి అసలైన కొలమానం ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చాయన్నది మాత్రమే కాదు… వాటివల్ల ఎన్ని కుటుంబాల జీవితం మారిందన్నదే. శ్రీసిటీలో 75 వేల మందికి ఉపాధి లభిస్తుండగా, ఉద్యోగుల్లో దాదాపు సగం మంది మహిళలేనని తాజా సమాచారం చెబుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, గార్మెంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి విభిన్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం సామాజిక మార్పునకూ దారి తీస్తోంది. ప్రత్యక్ష ఉద్యోగంతో పాటు రవాణా, నివాసం, చిన్న వ్యాపారాలు, సేవల రంగాల్లో ఏర్పడే అవకాశాలు కలిపి చూస్తే శ్రీసిటీ ప్రభావం ఫ్యాక్టరీ గేట్ల వద్దే ఆగడం లేదని అర్థమవుతోంది.
తయారీ రంగానికి కొత్త చిరునామా
ఒకే రంగంపై ఆధారపడకుండా విభిన్న పరిశ్రమలను ఆకర్షించడం శ్రీసిటీ బలాల్లో ముఖ్యమైనది. ఆటోమొబైల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, మెట్రో కోచ్‌ల నుంచి ఇంజినీరింగ్ ఉత్పత్తుల వరకు, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి ఎయిర్ కండిషనింగ్ పరికరాల వరకు ఇక్కడి తయారీ విస్తరించింది. అంటే ఒక రంగం మందగించినా మొత్తం పారిశ్రామిక వ్యవస్థపై ప్రభావం పరిమితంగా ఉండే డైవర్సిఫైడ్ మోడల్ రూపుదిద్దుకుంది. దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతులకు అనువైన తయారీ కేంద్రంగా ఎదగడం ‘మేకిన్ ఇండియా ఫర్ ద వరల్డ్’ లక్ష్యానికి శ్రీసిటీ స్థాయిలో కనిపిస్తున్న రూపంగా చెప్పవచ్చు.
కూలింగ్ హబ్‌గా ప్రత్యేక ముద్ర
శ్రీసిటీకి ఇప్పుడు మరో ప్రత్యేక గుర్తింపు కూడా చేరుతోంది. ప్రముఖ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థలు, వాటికి అవసరమైన కాంపోనెంట్ సప్లయర్స్ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావడంతో ఇది దేశంలోని ప్రధాన కూలింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా రూపుదిద్దుకుంటోంది. శ్రీ సిటీ సమాచారం ప్రకారం దేశంలో తయారయ్యే ఎయిర్ కండిషనర్లలో దాదాపు 40 శాతం ప్రస్తుతం ఇక్కడి నుంచే వస్తున్నాయి.. జరుగుతున్న విస్తరణలతో ఈ వాటా మరింత పెరిగే అవకాశముంది. ఒక ప్రధాన తయారీ సంస్థ వస్తే దాని చుట్టూ యాన్సిలరీ యూనిట్స్ ఏర్పడి కొత్త పెట్టుబడులు, ఉద్యోగాలు సృష్టించే క్లస్టర్ ఎఫెక్ట్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.
పరిశ్రమకు విద్య తోడైతే
ఫ్యాక్టరీలు మాత్రమే ఉంటే పారిశ్రామిక ప్రాంతం ఏర్పడుతుంది. పరిశ్రమలతో పాటు విద్య, పరిశోధన, నైపుణ్యం కలిస్తే నాలెడ్జ్ ఎకోసిస్టమ్ రూపుదిద్దుకుంటుంది. ఆ దిశలో IIIT శ్రీ సిటీ, Krea యూనివర్సిటీ, IFMR వంటి సంస్థలు ఇప్పటికే ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. తాజాగా శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రారంభం కావడం ఇండస్ట్రీ – ఎడ్యుకేషన్ లింకేజ్ ను మరో దశకు తీసుకెళ్తోంది. విద్యార్థికి తరగతి గదిలో జ్ఞానం, పక్కనే ఉన్న పరిశ్రమల్లో వర్క్ ప్లేస్ ఎక్స్ ప్లోసర్ లభించే వాతావరణం ఏర్పడితే కంపెనీలకు స్కిల్డ్ మ్యాన్ పవర్ అందుబాటులోకి వస్తుంది. భవిష్యత్ పెట్టుబడులకు ఇది అదనపు బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వాలు మారినా దిశ అదే
శ్రీసిటీ ప్రయాణంలో ప్రత్యేకంగా గమనించాల్సింది పాలసీ కంటిన్యుటీ.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టుకు తర్వాతి ప్రభుత్వాల కాలంలోనూ పారిశ్రామిక ప్రాధాన్యం కొనసాగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కాలంలో పార్టనర్ షిప్ సమ్మిట్స్ ద్వారా కొత్త పెట్టుబడులు వచ్చాయి.. అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వ సమయంలోనూ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీసిటీ అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలపై దృష్టి కొనసాగించారు. తిరిగి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొత్త పరిశ్రమలు, పెట్టుబడి ప్రతిపాదనలకు శ్రీ సిటీ కీలక వేదికగా కొనసాగుతోంది. ప్రభుత్వాలు మారినా ప్రాడక్టివ్ అసెట్ విలువను గుర్తించడం పెట్టుబడిదారులకు అవసరమైన పాలసీ కాన్ఫిడెన్స్ ను పెంచుతుందని ఈ పరిణామాలు సంకేతాలిస్తున్నాయి.
ఫ్యాక్టరీ దాటి సామాజిక ప్రగతి
పారిశ్రామిక అభివృద్ధి స్థానిక సమాజంతో సంబంధం కోల్పోతే దాని ప్రయోజనం పూర్తికాదు. ఈ కోణంలో శ్రీ సిటీ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ మౌలిక వసతులు, పర్యావరణం వంటి రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు మరో పార్శ్వాన్ని చూపుతున్నాయి. పరిశ్రమల CSR భాగస్వామ్యంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు, విద్యా సదుపాయాలు, స్కిల్ డెవల్ప్మెంట్ కార్యక్రమాలు సాగడం పారిశ్రామిక వృద్ధికి సోషల్ కనెక్ట్ ను జోడిస్తోంది. స్థానిక ప్రజలకు పరిశ్రమ అంటే కేవలం పెద్ద భవనం కాకుండా ఉద్యోగం, శిక్షణ, మెరుగైన సేవల రూపంలో కనిపించినప్పుడే దీర్ఘకాలిక అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుంది.
తదుపరి అధ్యాయం మరింత కీలకం
పద్దెనిమిదేళ్ల తర్వాత శ్రీసిటీ కథ ముగింపు దశలో లేదు… మరో విస్తరణ దశకు చేరుకుంది. అదనపు భూవిస్తరణకు మార్గం సుగమం కావడం, కొత్త కంపెనీల ఆసక్తి, కూలింగ్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో క్లస్టర్లు బలపడటం తదుపరి దశ మరింత వేగంగా ఉండే అవకాశాన్ని చూపుతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా దేశీయ తయారీని పెంచుతూ, ప్రపంచ పెట్టుబడులను ఏపీ వైపు తిప్పగలిగితే శ్రీ సిటీ విలువ మరింత పెరుగుతుంది. ప్రస్తుతం చూస్తే ఇది తిరుపతి జిల్లాలోని ఒక పారిశ్రామిక ప్రాంతం మాత్రమే కాదు… అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి, పాలసీ కంటిన్యుటీ కలిస్తే ఏం సాధించవచ్చో చూపుతున్న ఆంధ్రప్రదేశ్ మోడల్‌గా నిలుస్తోంది.
తాజా వార్తలు

ఓటు భద్రతపై ఈసీనెట్ రగిలించిన కొత్త చర్చ | ECINet Row Puts Voter Rights and Accountability in Focus
September 27, 2026, 5:18 PM IST
తెలంగాణలో రాజ్యాంగం.. బెంగాల్లో కమలం ఎత్తు మారిందా? BJP’s Contrasting Political Strategies in Telangana and West Bengal
September 20, 2026, 4:56 PM IST
వర్షం తగ్గింది.. రైతు చుట్టూ రాజకీయ వేడి మరింత పెరిగింది | Jagan Questions Andhra Pradesh Government Over Drought Relief
September 18, 2026, 2:25 PM IST

స్కాన్ అలవాటైంది.. ఇప్పుడు సామాన్యుడి జేబుకే కొత్త భారమా? | UPI MDR Row Raises Concerns Over Indirect Consumer Burden
September 16, 2026, 3:24 PM IST
వార్డు వార్నింగ్.. భక్తి వైభవం చెప్పిన ప్రత్యేక సంచిక | Rajasthan Civic Verdict and Ganesh Festivities in Focus
September 15, 2026, 4:00 PM IST
డీఎస్సీ నుంచి యూసీసీ దాకా రాజకీయ వేడి | From DSC Row to UCC: Political Heat Intensifies
September 14, 2026, 5:16 PM IST
పవన్ వ్యూహం నుంచి విజన్ దాకా.. రాజకీయ పల్స్Political Pulse: Pawan’s Strategy, Botsa’s Attack and Vision Debate
September 13, 2026, 5:28 PM IST
బకాయిల నుంచి బ్రిక్స్ దాకా.. పాలనలో కొత్త లెక్కలు | From Welfare Dues to BRICS: New Political and Governance Equations
September 12, 2026, 10:19 PM IST
