ఎడిటోరియల్ఆంధ్రప్రదేశ్తెలంగాణ

పులికాట్‌కు కొత్త పర్యాటక రూపం / Pulicat Tourism Plan Set to Transform Southern Andhra Coast

సరస్సే ఇక టూరిజం గేట్‌వే

పులికాట్ మరింతగా పులకరించబోతోంది.. నేలపట్టు పర్యాటకుల అడుగులతో మరింత జీవం పోసుకోబోతోంది. విదేశీ విహంగాల రెక్కల చప్పుడు ఇక దూరం నుంచి వినిపించే కథ కాదు.. నేరుగా వీక్షించే అద్భుత క్షణాలుగా మారబోతోంది. సరస్సు అలలు.. వలస పక్షుల సందడి.. సైక్లింగ్.. బోటింగ్.. ప్రకృతి నడకలు.. టెంట్ సిటీ.. ఇవన్నీ ఒకే టూరిజం సర్క్యూట్‌లోకి తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. “పర్యాటకం అంటే పులికాట్ తీరం” అన్న కొత్త గుర్తింపునకు బాటలు వేస్తున్నారు. కేంద్రానికి పంపనున్న సమగ్ర ప్రాజెక్టు నివేదికలో భాగంగా సుమారు రూ.800 కోట్ల అభివృద్ధి పనులు ప్రతిపాదించడంతో ఈ తీరప్రాంతం కొత్త రూపు సంతరించుకునే దశకు చేరుతోంది. తమిళనాడు సరిహద్దు నుంచి శ్రీహరికోట వరకు విస్తరించిన దక్షిణ కోస్తాకు కొత్త పర్యాటక ముఖచిత్రం ఇవ్వాలన్న అభివృద్ధి దృష్టి ఇందులో కనిపిస్తోంది.

చూసి వెళ్లడం కాదు.. ఆస్వాదించేలా

పులికాట్‌కు ఇప్పటివరకు వచ్చే పర్యాటకుల్లో చాలామంది పక్షుల సందడి చూసి కొన్ని గంటల్లోనే వెనుదిరిగేవారు. ఇప్పుడు ఆ పద్ధతినే మార్చేలా ప్రణాళిక రూపొందుతోంది. కుదిరి, అలకానితిప్ప, శ్రీహరికోట, వేనాడు ప్రాంతాలను కలుపుతూ సరస్సు ఒడ్డున సు 20 కిలోమీటర్ల రహదారి మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రయాణం చేస్తూనే నీటి అందాలు, పక్షుల గుంపులు, తీరప్రాంత జీవవైవిధ్యాన్ని వీక్షించే అనుభూతి కల్పించడం లక్ష్యం. అంటే పులికాట్ ఇక ఒక వ్యూయింగ్ పాయింట్ కాదు.. ప్రయాణమే ఒక టూరిజం ఎక్స్ పీరియన్స్ గా మారే విధంగా రాష్ట్రం ప్రణాళిక వేస్తోంది.

అలల మధ్య కొత్త అనుభూతి

పులికాట్ అసలు అందం నీటిమీద నుంచే కనిపిస్తుంది. అందుకే బీవీపాలెం నుంచి ఇరకం ద్వీపం మీదుగా వేనాడు వరకు సుమారు 18 కిలోమీటర్ల పర్యావరణహిత బోటింగ్ మార్గాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వలస పక్షులను దగ్గరగా వీక్షిస్తూ ద్వీపాల మధ్య ప్రయాణించే అవకాశం పర్యాటకులకు లభించనుంది. ఇరకం ఐలాండ్‌లో దాదాపు 80 ఎకరాల్లో టెంట్ సిటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన అమలైతే పులికాట్ డే-ట్రిప్ డెస్టినేషన్ నుంచి ఓవర్ నైట్ టూరిజం సెంటర్ గా మారే అవకాశం ఉంది. అదే స్థానిక ఉపాధికీ కొత్త ద్వారాలు తెరుస్తుంది.

నేలపట్టు నుంచి పులికాట్ దాకా

దొరవారిసత్రం మండలంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం పులికాట్ పర్యాటకానికి సహజమైన పొడిగింపు. అక్కడ సుమారు 2 కిలోమీటర్ల వాకింగ్ ట్రైల్ ను ఆధునికీకరించి నడక, సైక్లింగ్ ద్వారా పక్షులను వీక్షించేలా చేయనున్నారు. మార్గమధ్యంలో విశ్రాంతి సదుపాయాలు, పెద్దల కోసం ఈవీ బగ్గీలు ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక అన్ని వయసుల పర్యాటకులను దృష్టిలో పెట్టుకున్నదే. నేలపట్టు, పులికాట్‌లను విడివిడిగా కాకుండా ఒకే బర్డ్ అండ్ నేచర్ సర్కూట్ గా అభివృద్ధి చేస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు ప్రత్యేక ఎకో-టూరిజం ఐడెంటిటీ ఏర్పడుతుంది. ప్రకృతి పరిరక్షణతో పాటు పర్యాటక ఆదాయాన్ని పెంచే అవకాశం కూడా ఇక్కడే ఉంది.

షార్‌తో ప్రపంచ దృష్టి

పులికాట్‌కు మరో ప్రత్యేక బలం శ్రీహరికోట. సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం కారణంగా దేశం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, నిపుణులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. రాకెట్ ప్రయోగాల సమయంలో దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీహరికోట పేరు మార్మోగుతుంది. అయితే అదే రహదారిపై హోయలు ఒలకపోసే పులికాట్ సరస్సును పూర్తి స్థాయి పర్యాటక ఉత్పత్తిగా మలచడంలో ఇప్పటివరకు ఉన్న లోటును రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే దిశగా కదులుతోంది. స్పేస్ టూరిజం ఆసక్తిని ప్రకృతి పర్యాటకంతో అనుసంధానిస్తే శ్రీహరికోట-పులికాట్ ప్రాంతం దేశంలోనే విభిన్నమైన డెస్టినేషన్ గా ఎదగగలదు.

పరిశ్రమల మధ్య ప్రకృతి విరామం

శ్రీసిటీ సెజ్, మాంబట్టు పారిశ్రామిక ప్రాంతాల విస్తరణతో సూళ్లూరుపేట పరిసరాల సామాజిక, ఆర్థిక ముఖచిత్రం ఇప్పటికే మారుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు, కార్మికులు, వ్యాపార ప్రతినిధులు ఈ ప్రాంతంలో స్థిరపడుతున్నారు. వారికి వారాంతపు విహార కేంద్రాలుగా పులికాట్, నేలపట్టు వంటి ప్రాంతాలను తీర్చిదిద్దితే స్థానిక టూరిజం ఎకానమీకి స్థిరమైన డిమాండ్ ఏర్పడుతుంది. పరిశ్రమలకు సమీపంలోనే ప్రకృతి, పక్షులు, బోటింగ్, సైక్లింగ్, టెంట్ స్టే వంటి అనుభవాలు అందుబాటులోకి వస్తే పులికాట్ సీజనల్ టూరిజం నుంచి ఏడాది పొడవునా సందర్శకులను ఆకర్షించే కేంద్రంగా మారుతుంది.

ఒక సర్క్యూట్‌లో ఎన్నో ప్రపంచాలు

పులికాట్ ప్రత్యేకత సరస్సుతోనే ముగియదు. భీములవారిపాళెం ఓడరేవు ప్రాంతం, నేలపట్టు పక్షుల కేంద్రం, శ్రీహరికోట, శ్రీసిటీ, శ్రీకాళహస్తి, తిరుపతి-తిరుమల మార్గాలు.. ఆల్ ఇన్ వన్ సర్క్యూట్ అన్న స్థాయిలో దక్షిణ కోస్తాకు విస్తృత అవకాశాలున్నాయి. ప్రకృతి పర్యాటకం కోరేవారికి పులికాట్, పక్షుల ప్రేమికులకు నేలపట్టు, విజ్ఞానాసక్తి ఉన్నవారికి శ్రీహరికోట, ఆధ్యాత్మిక యాత్రికులకు శ్రీకాళహస్తి – తిరుమల అందుబాటులో ఉండటం ఈ ప్రాంతానికి అరుదైన బలం. సరైన రవాణా, వసతి, గైడ్ వ్యవస్థ కలిస్తే ఒక్కరోజు ప్రయాణాన్ని రెండు మూడు రోజుల పర్యాటక ప్యాకేజీగా మార్చే సామర్థ్యం ఈ బెల్ట్‌కు ఉంది.

పులికాట్ పులకరించే సమయం

రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలో అసలు బలం కొత్త నిర్మాణాలు మాత్రమే కాదు.. ఇప్పటికే ఉన్న సహజ, పారిశ్రామిక, శాస్త్రీయ, ఆధ్యాత్మిక వనరులను ఒకే పర్యాటక కథలో కలపడం. పులికాట్‌కు ప్రతిపాదించిన బోటింగ్, రోడ్డు మార్గాలు, టెంట్ సిటీ, పక్షుల వీక్షణ సదుపాయాలు కార్యరూపం దాల్చితే దక్షిణ ఆంధ్రప్రదేశ్ పర్యాటక మ్యాప్‌లో కొత్త కేంద్రం ఏర్పడుతుంది. సమగ్ర ప్రాజెక్టు నివేదికలతో తదుపరి దశకు వెళ్లే ఈ ప్రణాళిక స్థానిక ఉపాధి, చిన్న వ్యాపారాలు, హోమ్ స్టేలు, రవాణా రంగానికి కూడా ఊతమివ్వనుంది. ఇప్పటివరకు ప్రకృతి ఇచ్చిన అందం పులికాట్ సొంతం.. ఇక దానికి పర్యాటక రూపం ఇవ్వడం ప్రభుత్వ ముందున్న పని.

ఫోటోలు: Siribabu, Hobbyist Bird Photographer, Sullurpeta, Andhra Pradesh

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *